
Contributed by Potta Vamsi Krishna
ఆత్మహత్య కూడా ఓ హత్యే..!!
ఈ కలియుగంలో కనిపిస్తూ కనుమరుగయ్యేలా చేస్తూ ఫేమస్ అవుతున్న ఏకైక పదం.సూసైడ్(ఆత్మహత్య).
సినిమాలలో జైళ్లని చూస్తాం….అందులో ఖైదీలను చూస్తాం…ఎందుకురా ఇలా హత్యలు చేసి..అంత శిక్ష అనుభవించడం అని అయ్యో అనుకుంటాం…
కానీ, మన జీవితానికి వచ్చేసరికి మనల్ని మనమే చంపేసుకుంటున్నాం….
మర్చిపోకండి !! మనమూ ఓ హంతకుడే అవుతున్నాం….!!
జీవితంలో చాలా మందిని ఇలా చూస్తాం…ఒక్కొక్కరూ వాళ్ళ వయసుకి తగ్గట్టుగా ఇలా ఆలోచిస్తారేమో…
ఓ చదువుకునే విద్యార్థి చక్కగా ఆలోచించకపోతే…
చదువు…ఇది ఎంతోమంది జ్ఞానాన్ని పెంచే మూడక్షరాల పదం అనుకున్నాం కానీ..ఎంతోమంది చావులను చూపించే మూలం అనిపించేలా చేసేసింది…క్షమించండి..అది చెయ్యలేదు…మనమే అలా చేసేందుకు తోడయ్యామ్…
ఓ విద్యార్థి తన జీవితంలో ప్రతీ నిమిషం ఓ అడ్డంకిని దాటుకుంటూనే వస్తున్నాడు…నువ్వు ఇలా చేస్తే నీ లైఫ్ బాగుంటుంది…నువ్వు అలా అన్ని మార్కులు తెచ్చుకుంటేనే నీకు మ్యాటర్ ఉంటుంది..పది మందిలో నీకు మర్యాద ఉంటుంది..మా మర్యాద బ్రతుకుతుంది…అని వాళ్ళ బుర్రని రుద్దే వాళ్లే ఎక్కువయ్యారు తప్పా…నీ మార్కులదేముంది..నీ మెదడు ఎంత పదునైంది…ఆ మెదడుకి సాయం చేసే నీ మనసు ఏం కోరుకుంటుంది అని ఆగి ఆలోచించేవాళ్ళు తగ్గిపోతున్నారు…వాళ్ళ గుండెల్లో…అలా ఉండకపోతే ఎలా అన్న భయాన్ని పెంచేస్తున్నారు…చావును చూస్తున్నారు…చిరకాలం ఏడుస్తూ బ్రతుకుతున్నారు..
అయినా నాకర్థం కావట్లేదు సర్…మన చేతికుండే అయిదువేళ్లే ఒకేలా ఉండవ్ అని అంటారు కదా…మరి చరిత్ర సృష్టించేవాడు మాత్రం అందరిలో ఒకడిలా ఉండాలని ఎందుకు అంటారు…అనుకుంటారు సర్..??
వయసు మీద పడ్తుంది…బాధ్యత వహించలేకపోతే…
వయసు…వంటి మీదకొచ్చే అంకె అని మాత్రమే అనుకుంటాం…అంకెతో పాటూ అంతులేని బాధ్యతలు కూడా అని కొందరికే తెలుసు… ఈ కాలం యువత వారి ప్రయత్నాలతో ప్రాకులాడుతూనే ఉంటున్నారు…కానీ పక్కనుంచి పోయేవాడే…పనిలేక…ఏమైనా పని చేస్తున్నావా బాబు అని ప్రశ్నిస్తూనే ఉంటాడు..
ప్రశ్నించేవాడిదేముంది…నాలుక మీదుండే ఓ చిన్న మాట…కానీ ఆ మాట పడేవాడికి మాత్రం నా రాత ఇంతేనా అనిపించే ఓ తూటా…అది పడేవాడికి మాత్రమే తెలుసు..!! నువ్వు బాగుపడవురా అని తిట్టిపోసుకుంటున్నారే తప్పా…నువ్వు బాగున్నావా అని అడిగే మనుషులు ఈ యువత చుట్టూ తగ్గిపోతున్నారు…వాళ్ళు బ్రతుకుండాలనే ఆలోచనని వాళ్ళల్లో తగ్గించేస్తున్నారు….
అయినా నాకర్థం కావట్లేదు సర్…బాధను భరించలేకపోతున్నావ్…నీకెందుకురా బాధ్యతలు అని అంటున్నారే తప్పా…నీకు బాధొస్తే బందోబస్తుగా మేమున్నాం అని ఓ బంధం భుజం మీద చెయ్యేసి బలం ఇవ్వలేకపోతే ఎలా సర్..??
భార్యాభర్తలు…మీ మధ్య ఇంకొకటెందుకో…
భార్యాభర్తలు…ఈ కాలంలో ఆ రెండు పదాలకు మధ్యలో అహం అనే పదం పందిరేసుక్కూర్చుంది. ఆ అహానికి హక్కెవరిచ్చారు ఓ అందమైన సంసారం మధ్యలో చిచ్చురేపమని…అది కూడా వాళ్ళే కదా…ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి అని మీకు ముడివేసారు కానీ కొత్త సమస్యలను ముడికట్టుకుంటారని కాదు…అది తెలుసుకోకుండా అహంతో నోటికొచ్చినన్ని మాటలనేసుకొని మీ గురించే ఆలోచించుకుంటూ..మీ కలయికతో బయటకొచ్చిన మీ ప్రతిరూపానికి ప్రేమ పంచడంలో విఫలమవుతున్నారు…ఆ మాటలను భరించలేక…బాధ్యతను ఇంకా మోయలేక…ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాన్ని దూది కన్నా చులకనగా వదిలేస్తున్నారు…
అయినా నాకర్థం కావట్లేదు సర్…ఒక బంధంలో అలక అందం కానీ…అహం ఎలా అందం అవుతుంది సర్…??
ఇవే ఏంటీ ఇంకా చాలానే ఉన్నాయ్ మన చుట్టూ…
ఎన్నో బాధలను తట్టుకోలేకపోతేనే ఆత్మహత్య చేసుకుంటారు అని ఒకరు…అన్నిటికీ అదే దారి కాదు అని చెప్పడం చాలా సులువు అని ఇంకొకరు…ఇలా చాలానే అంటూ ఉంటారు…
చచ్చిపోవటానికి అంత ధైర్యం ఉన్నప్పుడు…దాన్ని బ్రతికి చూపించటానికి ఉపయోగించడంలో తప్పేముంది అని నేనంటా..??!!
“ఒకటి మాత్రం చెప్పగలను…
ఈ ఆలోచన ఇలానే ఇంకొన్నాళ్ళు కొనసాగితే…ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా ఉండాలంటే ఏమైనా మందులు కొనుక్కోవాలేమో అని మందుల షాపు బయట క్యూ కట్టే స్థాయికి దిగిపోతామేమో అన్న భయమైతే నాలో ఉంది..!! ”