
When you see the world through your window for 60 days
ముందుగా ఓ పద్యం….
లోకమెల్ల చూడు నిశ్శబ్ధమై మిగిలి ఉండు..
అడుగు బయటపెట్టి చూడు అపాయమై మీదకొచ్చి ఉండు
బ్రతుకు తెరువు కోసం చావుతోనే సహజీవనమనే ఆలోచనలోన
విశ్వదాభిరామ…విశ్వమంతా ఇదే సమస్య వేమ..!!
లాక్డౌన్..లాకప్ కన్నా భిన్నమైనది..బీభత్సమైనది..
లక్షలు కావు..లాఠీ పట్టుకున్నవాడే గొప్పవాడని తెలియజేసింది..
కోట్లు కావు..తెల్లకోటు వేస్కున్నవాడే దేవుడని తెలిసేలా చెప్పింది..
శుభ్రం చేసే పరిశ్రమ లేకుంటే శోకం తప్పదని వినిపించేలా చాటిచెప్పింది..!!
ఓ తల్లి ప్రేమ తల్లడిల్లిపోయింది…
అకస్మాత్తుగా పడిన లాక్డౌన్ కారణంగా…తన కొడుకు తన వద్దకు చేరలేడన్న విషయం తెలుసుకున్న నిమిషం…ఆ తల్లి రోజూ నీళ్లతో కల్లాపి జల్లే గుమ్మం…తన కన్నీళ్లతో తడిసిపోయింది…ఆమె బాధకు సాక్ష్యం కనిపిస్తున్నతన ఆర్తనాదనే. అర్ధం వ్యక్తం చెయ్యలేని ఆ మూగ తల్లి ఎదురు చూసి..ఎదురు కాచి..యదకు బరువు చేసి…ఓ ఉత్తరం రాసి పంపిస్తే…తన కొడుకు తిరిగి వస్తాడని ఆలోచించిన
ఆ పిచ్చి తల్లి పోస్ట్ ఆఫీసుకి వెళ్లగా…తాళం వేసుందని తల్లడిల్లిపోయి మెట్ల మీదే రోధిస్తున్న ఆమె ఆవేదన నన్ను కదిలించింది..!!
పైసలు లేక కాదు…పనిలేక పేదవాడినయ్యా…
పొద్దున్ననగా పని మొదలుపెట్టి సాయంకాలం వరకూ శ్రమకోసమే చెమటోడ్చే శరీరాలు కూలీలవి. పని లేకుంటే పూట గడవని కుటుంబాలు…పేదవాళ్ళల్లా ప్రాకులాడుతున్నాయి…తండ్రి ఆరోగ్యం కోసం పైసా పైసా కూడబెడ్తున్న కొడుకుకి పాపం పని లేకపాయె…పూట కూడా గడవకపాయె…అప్పు చేసే ధైర్యం లేకపాయె…తిరిగి తీర్చేదెలా అనే భయం ఎక్కువాయె…ఆదుకుంటానన్న ప్రభుత్వం అనుకున్న సమయానికే వస్తుందా అనే భయంతో ఎదురుచూస్తున్న ఆ చూపు నన్ను తరించేలా చేసింది..!!
గత్యంతరం లేదు…గమ్యాన్ని చేరాల్సిందే…
వలస కూలీల ఆవేదన..వాళ్ళు వేస్తున్న అడుగులలో వినిపిస్తుంది…ప్రతీ అడుగు వెనకున్న తపన కళ్ళకు కనిపిస్తుంది. ముసలివాడే కాదు…పసికందు కూడా ప్రయాణాన్ని ఆపడం లేదు…ఇది వాళ్ళు చేస్తున్న రణం కదా…రక్తం చిందుతున్నా పరువాలేదంటూ పరుగులు తీస్తున్నారు…వీళ్ళిద్దరూ చెయ్యి పట్టుకొని నడుస్తున్నారనే విషయమే కనిపిస్తుండచ్చు…అంతకు మించిన విషయం..ఆవిడ ఓ ఆరు నెలల గర్భిణి…ఆరు వందల కిలోమీటర్ల దూరాన్ని నడవడానికి సిద్దమై పూటకో గండాన్ని అధికమిస్తూ ఆశతో ముందడుగు వేస్తున్న ఈ ఘటన నా కళ్ళను కన్నీళ్లతో తడిచిపోయేలా చేసింది…!!
ఇన్ని బాధలు…ఆవేదనలు…ఇంట్లో ఉండి చూస్తుంటే అనిపించింది…బ్రతకడం ఇంత కష్టమా అని..బాధ ఇంత భయపెడుతుందా అనిపించి తట్టుకోలేక కిటికీని మూసేసా..!!
ఈ లాక్డౌన్లో…బాగా ఉన్నోడు…కాళ్ళూపుకుంటూ ఉయ్యాల ఊగుతున్నాడు…లేనోడు, మధ్యతరగతోడు మాత్రం ఉన్నదాన్నీ ఊడ్చుకుంటూ పూట పూటకీ ఆకలితో అలమటించిపోతున్నాడు. ఓ వ్యాధిని పోరాడటానికి అందరి సహకారం తప్పదు…కానీ, ఎన్ని రోజులు..?ఎన్ని నెలలు..?
బ్రతకడం కోసం దానితో పోరాటం చెయ్యాలి…లేకుంటే పాట్లు పడుతూ చచ్చిపోవాలి…అందుకు ఆ కరోనాతో మనకి సహజీవనం తప్పదని తెలుసుకోవాలి …!!
“అరవై రోజులలో నాకు కిటికీ నుంచి కనిపించింది ప్రపంచం కాదు…
ఓ ప్రపంచయుద్ధంపై పోరాటం చేస్తూ అలసిపోతున్న ప్రాణాలు..!!