
Contributed by Durga Prasad Patnana
చీకటే పున్నమి చంద్రునిలా మారితే
నీ కనుపాపలా ఉంటుందేమో !
నడి మధ్యాహ్నపు ఎండ వెన్నెల్లా మారితే
నీ కంటి శ్వేతపటలంలా ఉంటుందేమో !
గులాబి పూల రేకులు
నీ కనురెప్పల్లా మారాయేమో !
చీకటింట చిరుగాలులకు నాట్యమాడే వరిపంట
నీ కనురెప్పల వెంట్రుకలుగా మారాయేమో !
వర్షం కురిసే మునుపు మేఘాలు
నీ కనుబొమ్మల్లా మారాయేమో !
తూర్పున ఉదయించేది
నీ నుదుటి సింధూరమేనేమో !
సువాసన ఉందో లేదో అని పూల మొగ్గలు
నీ నాసికాగ్రము చెంత విచ్చుకొని అనుమతి పొందుతాయేమో !
నీ తేనె పెదవుల కోసం తేనెటీగలు
పరస్పర యుద్ధాన్ని ప్రకటిస్తాయేమో !
నా హృదయం సంగీతం వినిపించేది
నీ చెవుల ఆనందం కోసమేనేమో !
రోజూ ఉండే ఒత్తిడి నుండి విరామం పొందాలంటే
నీ చెవి జుంకీల కింద తల దాచుకుంటే చాలేమో !
నేల నుండి వెన్నెలకు నిచ్చెన వేస్తే
అది నీ వాలు జడేనేమో !
వెన్నెలను మకరందంగా దాచుకొని
నీ జడలో పూలు విరబూసాయేమో !
నిత్యం పొంగే నదులు నిశ్చలమై
నీ నీలి వర్ణపు చీరలా మారాయేమో !
వర్షపు చినుకులు నీ శరీరాన్ని తాకగానే
ముత్యాల హారంగా మారాయేమో !
హరివిల్లు లోని ఏడు రంగులు విడిపోయి
నీ చేతి గాజులుగా మారాయేమో !
చలి కాలపు ఉదయాన తామరాకుల మీద నిలువ లేని నీటి బిందువులు నీ పట్టీల మువ్వలుగా మారాయేమో !
ప్రకృతి స్వరూపమైన నీకు
ప్రపంచం పాదాక్రాంతమవ్వాలేమో !
నేను నీ ప్రేముకిడినేమో
నీవే నా ప్రేయసివేమో
ప్రేయసివేమో..ప్రేయసివేమో..ప్రేయసివేమో.