
కలిసిలేక వచ్చెను “బానిసత్వం”
కలిసి కట్టుగా తెచ్చెను మరల “స్వాతంత్రం”
స్వాతంత్రమొచ్చినాక మరిచెను గతం…
సంబరాల మాటున పుట్టెను నాయకుడనే స్వార్థం..స్వగతం..
సమస్య గానే మిగిలెను మరల “బానిసత్వం”
ప్రభువులు మారెను..పల్లకీ మారెను..
దాన్ని మోసే వాడి పక్కటెముకలు మాత్రం ఇంకా అరిగెను…
మోస్తూ మోస్తూ వాడు ఇంకా మోడు గానే మిగిలెను..
ఆకలి కేకల కి దగ్గరగా..న్యాయన్యాయాలు కి దూరంగా.. దారుణం గా.. అరణ్య రోదన కి అసలు అర్థంగా… అర్ధాంతరంగా ఆగే బ్రతుకుల మధ్య “స్వాతంత్రం” అని నాకంటూ ఒకటి ఉంది అనే విషయం కూడా మరిచెను…
ఈ సంబరాలకే శాశ్వతంగా దూరంగా మిగిలెను..
రాసుకున్నాం రాజ్యాంగం..
ఇచ్చాం దానికి హక్కుల రూపం..
కానీ ఏం సాధించాం ???
కట్టుకున్న ప్రగతి భవంతులు..
ఆకట్టుకున్న ప్రజా చట్టాలు..
కానీ అవన్నీ బలవంతుల చుట్టాలు..
వాళ్ళు రాసిన కనికట్టు కథ కి కాబోయే సాక్ష్యాలు అని కనిపెట్టలేకపోయాం..
ఇంకా అంతే అజ్ఞానం తో మనం సావాసం చేస్తున్నాం.
మన అజ్ఞానం తో వాళ్ళు సవారీ చేస్తుంటే సర్డుకుపోతూ సంవత్సరానికి ఒకసారి “సాధించాం స్వతంత్రం” అంటూ సంబరాలు చేసుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం…
మూర్ఖత్వానికి ఇంకా బానిస లాగే ఉన్నాం..
కుల మత ప్రాంత మనే భావనలో కూరుకుపోయాం..
అలా ఓ అడ్డు గోడ కట్టి మార్పు కి ఆమడ దూరంలో మిగిలిపోయాం..
ఇదిరా అసలు బానిసత్వం..
వదలరా నీ అలసత్వం…
అలా వదిలి…
అప్పుడు చేసుకోరా ఈ సంబరం..
ఆస్వాదిస్తూ అసలైన ఆ స్వాతంత్ర్యం…