Home Musings ఆమె చెప్పని ఆత్మకథ

ఆమె చెప్పని ఆత్మకథ

Girl musings

 By Shirisha Medagam

ఆడది!

ఇది నీలాగా నాలాగా…
ఇది రాయగలిగే అవకాశమో, చదివే అవకాశమో ఉన్న ఆడదాని గురించి కాదు
సగటు ఆడపిల్ల గాధ..
ప్రపంచంలో ఇన్ని మారినా,మారుతున్న ఆ మార్పు ఉందని, దాన్ని పొందాలని కూడా తెలీక బ్రతుకుతున్న ఆడదాని కథ….

కాస్తోకూస్తో చదువుకున్న వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి రావడం మన ఆచారాలకి.. ఆలోచనా విధానం కి.. సభ్యతకి సూటి ప్రశ్న !!
ఇందులో ఉన్న ప్రతీ కష్టానికి ఒక సాక్ష్యం ఉంది..

ఆడపిల్లకి అమ్మాయికి ఆ అనే అక్షరం మారినట్టు ఆడపిల్ల జీవితం కూడా అమ్మాయి దగ్గరినుండి అమ్మ అయ్యేవరకు మారుతూనే వస్తుంది

ఆడపిల్ల ఎప్పుడూ ఒంటరి కాదు
తనమీద ఎన్నో కళ్ళు ఉంటాయ్ !
తనచుట్టూ ఎన్నో పుకార్లు ఉంటాయ్!!

ఆడపిల్లని ఇంటికి మహాలక్ష్మి కన్నా వంటింటి లక్ష్మి ని మాత్రం చాలామంది అనుకుంటారు…వజ్రాలు రాసులుగా పోసి అమ్మినట్టుగా అమ్మాయిని అపరంజిని చేసి అమ్మేస్తారు..

వజ్రం ఎక్కువ రేటు ఇచ్చేవాడికి దక్కుతుంది !
ఆడపిల్ల తక్కువ రేటు అడిగేవాడికి ఆలి అవుతుంది!!

అమ్మగారింటికి బంధువౌతుంది అత్తగారింటికి బంధీ అవుతుంది
అవసరాలు తీర్చే అమ్మానాన్న దూరం అయ్యాక తనకేం అవసరమో కూడా మర్చిపోతుంది
అక్కరకు రాని ప్రేమాభిమానాలకు బంధనమౌతుంది
భాందవ్యబంధుత్వాలు బానిస సంకెళ్ళు అవుతాయ్
ఆనంద ఆరోగ్యాలు శూన్యంలోకి జారుకుంటాయ్

ప్రేమానురాగాల కరువులో ఆత్మాభిమానం అంచున అదృశ్య ఆకాశవర్షిణి రాక కోసం ఎదురుచూపే జీవితమవుతుంది
ఇది తన గాధ మాత్రమే.. తన గోడు వేరే..
తన గురించి తనైనా అంత పట్టించుకుంటుందో లేదో తెలీదు కాని తన చుట్టూ ఉండే వందల కళ్ళకి తనమీదే ధ్యాస !!

ఆడపిల్ల ఏం చేసిన తప్పుగా కనిపించే ఆ కళ్ళకి ఏం చేస్తే కళ్ళు తెరుచుకుంటాయ్, ఎలా చెప్తే తన కన్నీళ్ళు అర్థమౌతాయ్ !!
అష్టలక్ష్మి లా తయారుచేసి అంగడిలో బొమ్మని కొనుక్కెల్లే వాళ్ళలా అవయవాల పనితీరు మాత్రమే చూసి ఆడదాని అంతరంగం ఏంటో కనీసం అడగనైనా అడగని అమ్మానాన్నలకి వచ్చే పెళ్ళిపెద్దలకీ చెప్పేదెలా…కోట్ల సంబంధం కాకపోయినా కోరుకున్నవాడ్ని చేసుకునే అవకాశమో,నచ్చాడో నచ్చలేదో చెప్పే అవకాశమో ఇవ్వమని..
ఆడపిల్ల పుడితే అరిచి గోలచేసే మొగుడికి,అత్తమామలకి,ఆ పుట్టుకలో తేడాకి కారణం మగాడే అని చెప్పేదెలా..
అక్కాచెల్లెల్లు ఉన్నారని వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళ వయసు పైబడుతుందని తన పెళ్ళి సమయాన్ని నిర్ణయించుకునే అర్హత కూడా ఇవ్వకుండా అర్థాంతరంగా పెళ్ళి చేసి తన ఆశలనీ,ఆశయాలని చంపేసేవాళ్ళకి చెప్పేదెలా…జీవితంలో పెళ్ళి ఒక భాగమే అని తన భవిష్యత్తుని అలా మధ్యలోనే ఆపేయొద్దని…

ఆడపిల్ల చేసిన చిన్నదో పెద్దదో తప్పులకి అయ్యని వదిలేసి అమ్మని మాత్రమే నిందిస్తుంటే తన భాధ్యత ఒక్కరిది కాదు ఇద్దరిది అని బోధించేదెలా…
ఆడపిల్ల ఆడ..పిల్లే అని, మంచి సంబంధం అని మళ్ళీ రాదని  అర్ధాంతరంగా వయసు రాకుండానే అత్తారింటికి పంపించేస్తు అష్టకష్టాలని అరచేతిలో పెట్టే అమ్మానాన్నలకి అర్థమయ్యేలా  చెప్పేదెలా..ఆలోచింపజేసేదెలా ??
అవకాశం దొరికితే చాలు అదునుచూసి పరాయి ఆడపిల్లని అమ్మలా చూడకపోయినా కనీసం అక్కాచెల్లెల్లా చూడాలి అని తెలుసుకోకుండా అఘయిత్యాలు చేసేవాళ్ళకి శిక్ష వేసేదెలా ??

వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆలి, ఆడపడుచులు ఉంటారని గుర్తుచేసేదెలా ??
ఆడపిల్ల బరువని కొడుకేదో ఉద్దరిస్తాడని చిన్నాపొన్నా విషయాల్లో కూడా వ్యత్యాసం చూపిస్తూ తనని మానసికంగా మదన పడేలా చేసేవాళ్ళకి చెప్పేదెలా…కొడుకు కొరివి మాత్రమే పెడతాడని కూతురు కాస్తైనా కూడు పెడతుందని!!

అమ్మాయిగా పుట్టిందనో,అందంగా ఉందనో ఆకర్షనే ప్రేమ అనుకొని ముందూ వెనక ఆలోచించకుండా వెంటపడి ప్రేమించలేదనో,పట్టించుకోలేదనో తన మొహాన్నో, జీవితాన్నో నాశనం చేసేవాళ్ళకి చెప్పేదెలా…తనకీ మనసుందని తన ఇష్టాఇష్టాల్ని గౌరవించి తనని ఇబ్బంది పెట్టొద్దని..ఒకవేళ ఆ మనసులో ఆశలు ఉన్నా అవి తీర్చుకునే అవకాశం తనకి లేదని…

ఆలి అయింది కదా అని అన్ని హక్కులు వచ్చేస్తాయని అవసరానికి తప్ప  తన ఆనంద.. ఆరోగ్యాలు పట్టించుకోని ఆ భర్త కి అర్ధం అయ్యేలా చెప్పేదెలా…నీకు ఆలి కావచ్చు కాని తను ఒకరి ఇంట్లో మహారాణి అని…
అమ్మాయిని ఒకరి ఇంటికి కోడలిగా పంపి అక్కడ ఆనందంగా ఉండాలని కోరుకునే అమ్మానాన్నలకి అదే ఇంటికి కోడలు వచ్చి అత్తమామలు అవగానే తనని కూతురుగా కాకపోయినా కనీసం మనిషిలా అయినా చూడాలని నేర్పించేదెలా….

అమ్మ అవుతున్న అని ఆనందపడే తనకి పుట్టేవాళ్ళు కాటికి కాళ్ళు చాపాక పట్టించుకోరు మమకారం పెంచుకోకు తల్లి అని చెప్పేదెలా

ఆడది ఇంటిపట్టున ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ నీతులు చెప్పే సొసైటికి అంతరిక్షం దాకా చేరే ఆడది After All గడప దాటి తన బ్రతుకు తాను బ్రతుకుతుంటే ఆసరా అవ్వకపోయినా అడ్డంకి అవ్వొద్దని చెప్పేదెలా

ఆడదాని గుండె ధైర్యం ఎంతో తెలుసుకొని దాన్ని జయించలేక ఆడపిల్ల అమ్మానాన్నలకి భయపడాలి పెళ్ళైయాక చేసుకున్నవాడికి భయపడాలి అని ఆఖరికి కన్న బిడ్డలకి కూడా భయపడేలా చేసి తన ధైర్యాన్ని చంపేసి భయమే తన జీవితంగా మార్చేసిన వాళ్ళకి చెప్పేదెలా..తను అనుకుంటే ఏదైనా మార్చగలదు,సాధించగలదు అని

ఆడపిల్ల ఆరుబయటకి వెళ్ళాల‌న్నా పిల్లాడ్నైనా తోడిచ్చి పంపి మగాడు అడ్డమైన తిరుగుళ్ళు  తిరిగినా అదేదో మగతనం అని పొంగిపోయే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చెప్పేదెలా.. అదుపులో ఉంచాల్సింది ఒక్క ఆడదాన్నే కాదు మగాన్ని కూడా అని !!

ఆడది రోజంతా కష్టపడి ఇంటెడు చాకిరి చేసినా ఇంకా నువ్వేం ఉద్దరిస్తున్నావ్ ఇంట్లో తిని కూర్చోవడమేగా అంటు చులకన చేసి తన కష్టాన్ని చూడని వాళ్ళకి ఒక్కరోజైనా ఆ పనులు చేసి ఆ కష్టం విలువ తెలుసుకోమని చెప్పేదెలా

ఆడపిల్ల పరాయి మగాడితో మాట్లాడితేనే పనికిమాలిన లింకులు పెట్టే పద్ధతీ పాడు లేని లోకులకి చెప్పేదెలా…మాట వల్ల మానం చెడిపోదని !!

దేవుడికైనా జాలి అంటూ ఉంటే…మళ్ళీ జన్మంటూ ఉంటే…పుట్టిన ప్రతీ అమ్మాయిని వచ్చే జన్మలో మగాడిగా పుట్టించు….
ఆడది అవసరం….ఒక అమ్మగా,అక్కగా,చెల్లెగా, భార్యగా….అంతేగాని నీ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఆడది పుట్టలేదు….

ఇన్ని ఉన్నాకూడా ఆడదానికి చిన్న ఆసరా తన గుండెధైర్యం…అవమానాలు అధిగమించడానికైనా తన జీవితాన్ని దిద్దుకోడానికైనా….వీటికి తోడు తన జీవితంలో ఉండే ఒకరో ఇద్దరో తనికి అండగా ఉండటం..అది కూడా లేని వాళ్ళకి తనకు తనే అండ అవ్వాలి….అవరోధాలు చెప్పిరావు అవమానాలు అందరిలో ఉన్నప్పుడే వస్తాయ్…ఏదేమైన ఎవరేమనుకున్నా నీకు నువ్వు ఇచ్చుకునే ధైర్యం కొన్నిసార్లు ఆ దేవుడు కూడా ఇవ్వలేడు….ఆడదాన్ని ఎవరు కాపాడుతారో తెలీదుగాని అక్షరం మాత్రం కాపాడుతుంది..చదువే తనకి దారి చూపుతుంది…

ఇంతటి చీకటి సమాజంలో కూడా ఆడదాని జీవితంలో ఒక చిరుదీపం…తనని అర్థం చేసుకొనే అన్నో,తమ్ముడో,నాన్నో,కట్టుకున్నవాడో దొరకడం…ఈ స‌మాజాన్ని పక్కన పెట్టి తన ప్రయాణానికి తోడుగా నిలిచేది,తన రెక్కలకి అలసట తీర్చేది,తన గమ్యానికి దారులు వేసేది వాళ్ళే…నచ్చిన ఉద్యోగం అనో,నచ్చే జీవితమనో వాళ్ళు ముందుకి పరుగులు పెడుతుంటే వాళ్ళ వెంటే ఉండి ఏ నీడ తనమీద పడకుండా కాపాడేది వాళ్ళే…అలాంటి వాళ్ళందరికి పాధాభివందనాలు…🙏🙏🙏
ఆడదానికి ఆడదే శత్రువు అంటారు అది ఎంతవరకు నిజమో తెలీదుగాని ఈ సమాజం మాత్రం ఆడదానికి శత్రువే…స్త్రీ పురోగమించింది ఎంతో పురోగతిని సాధించింది ఊర్లు దేశాలు గ్రహాలు కూడా దాటి తన ఉనికిని చాటుకుంది…ప్రతీ ఆడపిల్ల అంతరిక్షం చేరాలని కోరుకోకపోవచ్చు కానీ విమర్శలు లేని సమాజం కోసం మాత్రం తప్పకుండా ఆశ పడుతుంది…అందనంత దూరంలో ఉన్న ఆకాశాన్ని చేరుకుంటున్నాం కాని పక్కనే ఉన్న ఆడదాని మనసేంటో అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం…

 ప్రతి ఒక్కరి జీవితంలో పైన చెప్పినవన్నీ ఉండకపోవచ్చు కాని ఏదో ఒక్కటి మాత్రం తప్పకుండా ఉంటుంది….ఇప్పుడిప్పుడే నోరు విప్పి మాట్లాడే హక్కో, నచ్చింది చేసే హక్కో,నచ్చినట్టు బ్రతికే అవకాశమో అమ్మాయిలకి దక్కుతుంది…

ఒకరి ఇద్దరిని చూసి అందరూ అంతే అనుకోకండి!! స్వేచ్ఛ ఇస్తే ఎదో అవుతుంది అని భయపడకండి..

తనకి నచ్చినట్టు ఉండే ఒక్క అవకాశం లేని వాళ్ళు.. బయటకు చెప్పలేని వాళ్లు చాలా మంది ఉన్నారు అండి !!

So Please Respect Women..
Respect her choices..
Let her Live her Life

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In Musings

Check Also

ఆత్మహత్య కూడా ఓ హత్యే.

Contributed by Potta Vamsi Krishna …