Home Poetry విలక్షణాక్షరం

విలక్షణాక్షరం

Contributed by Bharathsai Chalapadhi

నిగూఢమైన భావాల భారమంతా
ఆ అక్షరాల్ని అష్ట వంకర్లు తిప్పుతుంటే
అనంత సీమ వాసనల్ని
గుప్పు గుప్పున గుప్పించే ఆ కలం
అద్భుత రస వాక్య పేటికల్లో
అమరే కథనాల్ని అలవోకగా సృజిస్తూ
అగ్ర ఉగ్ర గణాల ఆధిపత్య మూలాలను
ముల్లుకర్రతో సూటిగా పోడుస్తుంది

పీడిత బహుజన సమాజం
అనివార్యంగా అట్టడుగుకు ఒదిగిపోయీ
సాహోమంటూ సాగిలపడే
బానిస భావజాలాల్ని బహిర్గతపరిచే
సందర్భాలెన్నింటినో సవివరమైన
దృశ్య వీచికలుగా దృగ్గోచరం చేస్తూ
తమ అల్ప సంతోషాల కోసం
పెత్తందారుల పంచలనంటిపెట్టుకొని
భజనలు చేసే తాళం కప్పల్ని చూసి జాలిపడుతూ
అనివార్యతల్ని అంటగట్టే అహంభావులపై
అక్షర గొంతుకలు అక్కసు వెళ్ళగక్కుతాయి

పకడ్బందీగా నిర్మించిన
నిచ్చెన మెట్ల సమాజంలో
బతికినంత కాలం
అగ్ర తాంబూలమందుకునేందుకు
అందమైన ముసుగులేసుకున్న
శ్రమ జీవుల పాలిటి పరాన్నభుక్కుల
కుటిల చాందస మార్మిక ప్రపంచ వైభవాన్ని
నిగ్గదీసి ప్రశ్నస్తూ మన ముందు
నడి వీధిలో నగ్నంగా నిలబెట్టీ
నోరెళ్ళబెట్టి నీళ్ళు నమిలేలా చేస్తూ
అనర్గళంగా సాగే ఆ గళ విన్యాసం
వాళ్ళంతా సిగ్గుతో చితికిపోయేలా
నిర్దాక్షిణ్యంగా నలగ్గొడుతుంది

తనను ఆకట్టుకున్న తాత్త్విక భావ చింతనలో
మమేకమై ఐకాంతిక కోసం కలవరిస్తూ
తనదైన ప్రపంచంలో తనమునకలుగా సంచరిస్తూ
మూలాల మూల మూలలనూ స్పృశిస్తూ
పాఠకుల్ని సమ్మోహన పరుస్తూ
వాస్తవ ప్రపంచంలోకి వేలుపట్టి నడిపిస్తూ
మును ముందుకు సాగుతున్నాయి
నా అక్షరాలు విలక్షణ సాహితీ రథము పై!!

Load More Related Articles
Load More By ohmanasa-admin
  • ప్రేయసివేమో

    Contributed by Durga Prasad Patnana …
  • నాడు – నేడు

    By Ravindra *నాడు* పట్టుపరుపులు పల్లకీమోతలు.. ప్రభువులెందరో పరిత్యజించిరి.. పర్ణ,ఫలములే ప్…
  • Rrrrrrrrrr

    ప్రేమ అనంతం

    Contributed by Rakesh Manu …
Load More In Poetry

Check Also

ప్రేయసివేమో

Contributed by Durga Prasad Patnana …